బిల్ల మహేందర్Jj ]eub h IiQq eaeiacFf 12 Vvm
| బిల్ల మహేందర్ | |
|---|---|
బిల్ల మహేందర్ | |
| జననం | 1976, సెప్టెంబర్ 09 వేలేరు, వరంగల్ అర్బన్ జిల్లా |
| నివాస ప్రాంతం | హన్మకొండ, వరంగల్ అర్బన్ జిల్లా |
| వృత్తి | ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడు |
| ప్రసిద్ధి | తెలుగు సాహితీవేత్త, సమాజ సేవకులు |
| మతం | హిందూ |
| భార్య / భర్త | సరిత |
| పిల్లలు | అక్షిత్, ఆశ్రిత్ |
| తండ్రి | రాజమౌళి |
| తల్లి | జయ |
బిల్ల మహేందర్ ప్రముఖ వర్థమాన యువ తెలుగు సాహితీవేత్త, సమాజ సేవకులు.
విషయ సూచిక
- 1 జననం
- 2 కుటుంబ నేపథ్యం
- 3 బాల్యం
- 4 విద్యాభ్యాసం
- 5 ఉద్యోగం
- 6 వివాహం
- 7 రాణిస్తున్న రంగాలు
- 8 సాహితీ కృషి
- 9 ప్రచురించిన పుస్తకాలు
- 10 సామాజిక సేవ
- 11 నిర్వహిస్తున్న పదవీ భాధ్యతలు
- 12 అందుకున్న అవార్డులు/పొందిన సన్మానాలు
- 13 మూలాలు
- 14 ఇతర లింకులు
జననం[మార్చు]
బిల్ల మహేందర్ 1976, సెప్టెంబర్ 09 న వరంగల్ జిల్లా లోని వేలేరు ప్రాంతంలో జయ, రాజమౌళి దంపతులకు రెండవ సంతానంగా జన్మించాడు. అతనికి ఒక అన్న(యుగంధర్), ఒక చెల్లె(భాగ్యలక్ష్మి) ఉన్నారు.
కుటుంబ నేపథ్యం[మార్చు]
మహేందర్ తల్లిదండ్రులు అతని చిన్నతనంలోనే బతుకుదెరువు కోసం బొంబాయికి వలస వెళ్ళారు. వీరిది సామాన్య దిగువ మధ్యతరగతి కుటుంబం. మహేందర్ తండ్రి ప్రస్తుతం సిరిసిల్లలో చేనేత కార్మికుడిగా, తల్లి దినసరి కూలీగా పనిచేస్తున్నారు.
బాల్యం[మార్చు]
మహేందర్ బాల్యమంతా దాదాపు వేలేరులోనే గడిచింది. రెండేళ్ళ వయసులో ఉన్నప్పుడు కొంతకాలం బొంబాయిలో గడిచింది. చిన్నతనంలోనే అతనికి పోలియో వ్యాధి సోకింది. అయినా కూడా చాలా చురుకుగా ఉండేవాడు.
విద్యాభ్యాసం[మార్చు]
మహేందర్ పాఠశాల విద్యాభ్యాసమంతా వేలేరులోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో కొనసాగింది. ఎనిమిదవ తరగతిలో ఉన్నప్పుడు మహాకవి శ్రీశ్రీ గారి ప్రముఖ రచన మహాప్రస్థానం పుస్తకం చదివాడు. దాంతో శ్రీశ్రీ మీద అభిమానం, సాహిత్యం మీద అభిరుచి, ఆసక్తి ఎర్పడ్డాయి. పదవ తరగతిలో తెలుగు మాస్టారు బోధనా ప్రభావం వల్ల తెలుగు భాష పట్ల గౌరవం, ఇష్టం ఏర్పడింది.
1993-1998 మధ్య కాలంలో వరంగల్ లోని చందా కాంతయ్య స్మారక కళాశాలలో ఇంటర్మీడియేట్ మరియు డిగ్రీ విద్య అభ్యసించాడు. ఆ తర్వాత 1999లో నాగార్జున సాగర్ లోని ఉపాధ్యాయ విద్యా కళాశాలలో బి.ఎడ్. పూర్తి చేసాడు. అనంతరం గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుండి ఎం.ఎ.(తెలుగు)లో పట్టభద్రుడయ్యాడు.
ఉద్యోగం[మార్చు]
విద్యాభ్యాసం అయిపోగానే 2000 సంవత్సరంలో డి.ఎస్సీ. ద్వారా ప్రాథమిక ఉపాధ్యాయుడిగా ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాడు. మొదట దేవరుప్పుల మండలంలోని ప్రాథమిక పాఠశాలలో, ఆ తర్వాత నర్మెట్ట మండలంలోని ప్రాథమిక పాఠశాలలో పనిచేసాడు. ప్రస్తుతం హసన్ పర్తి మండలంలోని సుబ్బయ్యపల్లె గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్నాడు.
వివాహం[మార్చు]
2002లో సరితతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు మగపిల్లలు(అక్షిత్, ఆశ్రిత్) కలిగారు.
రాణిస్తున్న రంగాలు[మార్చు]
- సాహిత్య రంగం
- విద్యారంగం
- సామాజిక సేవా రంగం
సాహితీ కృషి[మార్చు]
మొదట ప్రేమ, ప్రకృతి మొదలగు అంశాల మీద కవిత్వం రాసిన మహేందర్ ఆ తర్వాత సామాజిక అంశాల గురించి కవిత్వం రాయడం ప్రారంభించాడు.
2009 నుండి కొనసాగిన తెలంగాణ స్వరాష్ట్ర సాధన మలిదశ ఉద్యమం మహేందర్ ను బాగా ప్రభావితం చేసింది. ఉద్యమాలలో, సాహిత్య కార్యక్రమాలలో పాల్గొంటూనే ఆ భావజాలంతో రాసిన గేయాలతో 2011లో పోరుగానం అనే తన తొలి సంపుటి వెలువరించాడు. ఉద్యమం తీవ్రస్థాయికి చేరిన సందర్భంలో విద్యార్థుల ఆత్మబలిదానాలను చూసి చలించిపోయి బలిదానాలు మరుద్దాం అనే శీర్షికతో ఒక దీర్ఘ వ్యాసాన్ని రాసి, బుక్లెట్ గా రూపొందించి, పంచి పెట్టి విద్యార్థుల్లో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత 2012లో తెలంగాణ ఉద్యమ నేపథ్యంతోనే పిడికిలి అనే స్వీయ కవితా సంపుటి ఆవిష్కరించాడు. మహేందర్ తెలంగాణ ఉద్యమం మలిచిన కవిగా తనను తాను పేర్కొంటాడు.
ఒక వికలాంగుడిగా తను ఎదుర్కున్న సమస్యలు, అనుభవాలను దృష్టిలో ఉంచుకొని వికలాంగుల్లో ఆత్మస్థైర్యం నింపే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 100 మంది కవులను సంప్రదించి వారి చేత ప్రత్యేక ప్రతిభావంతుల పై కవితలు రాయించి 100 కవితలతో కాలాన్ని గెలుస్తూ.. అనే కవితా సంకలనాన్ని రూపొందించి 2014లో వెలువరించాడు. ఇది తెలుగు సాహిత్య చరిత్రలో వికలాంగుల గురించిన అంశంతో వచ్చిన తొలి కవితా పుస్తకంగా గుర్తింపు పొందింది, అలాగే మహేందర్ కు సంపాదకుడిగా మంచి పేరు తెచ్చిపెట్టింది. 2015లో కూడా అదే అశంతో తన స్వీయ కవితలతో గెలుపు చిరునామా అనే సంపుటి ప్రచురించి అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా అప్పటి జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా విడుదల చేయించాడు.
తన అనుభవాలను, జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ.. సామాజిక సమస్యలకు స్పందిస్తూ రాసిన పలు కవితలతో 2016లో కొన్ని జ్ఞాపకాలు, కొన్ని ప్రశ్నలు అనే కవితా సంపుటి వెలువరించాడు. అదే సంవత్సరంలో తెలంగాణ రచయితల సంఘం-వరంగల్ శాఖకు సంయుక్త కార్యదర్శిగా నియమితుడయ్యారు. తన పనితనంతో అనతికాలంలోనే ఎదిగి ప్రస్తుతం అదే సంస్థకు జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికై, భాధ్యతలు చేపట్టి సాహిత్య సేవ కొనసాగిస్తున్నాడు.
చాలా సాహిత్య పత్రికలు, దిన పత్రికలు, మాస పత్రికలు, సంకలనాలు మరియు అంతర్జాల పత్రికలలో మహేందర్ రచించిన పలు కవితలు, పాటలు, వ్యాసాలు ప్రచురితమయ్యాయి. ప్రముఖుల ప్రశంసలందుకున్నాయి.
2015లో తన స్వగ్రామం మీదున్న మక్కువతో తను రాసిన పాటలతో మా ఊరు అనే ఒక ఆడియో సీడీ కూడా రూపొందించి విడుదల చేశాడు.
ప్రచురించిన పుస్తకాలు[మార్చు]
- పోరుగానం (తెలంగాణ ఉద్యమ గేయ సంపుటి) - 2011
- బలిదానాలు మరుద్దాం (బుక్లెట్) - 2011
- పిడికిలి (తెలంగాణ ఉద్యమ కవితా సంపుటి) - 2012
- కాలాన్ని గెలుస్తూ.. (ప్రత్యేక ప్రతిభావంతుల పై కవితా సంకలనం) – సంపాదకత్వం - 2014
- గెలుపు చిరునామా (ప్రత్యేక ప్రతిభావంతుల పై కవితా సంపుటి) - 2015
- కొన్ని ప్రశ్నలు - కొన్ని జ్ఞాపకాలు(కవితా సంపుటి) - 2016
సామాజిక సేవ[మార్చు]
ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్(APTF)(ప్రస్తుతం TPTF) సభ్యుడిగా ఉంటూ ఉపాధ్యాయుల సమస్యలపై పోరాటాలు కొనసాగించాడు.
రాష్ట్రంలోనే తొలిసారి దివ్యాంగ ఉపాధ్యాయుల సంఘం ఏర్పాటు చేయడంలో కృషిచేసిన వారిలో మహేందర్ కీలక సభ్యుడు. ఆ సంస్థకు వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా భాద్యతలు చేపట్టి దివ్యాంగ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేసాడు. ప్రస్తుతం ఆ సంస్థకు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు.
విద్య ద్వారానే సమానత్వం సాధించబడుతుంది అనే అంబేద్కర్ మాటను స్పూర్తిగా తీసుకుని, ప్రార్ధించే పెదాల కన్నా సహాయం చేసే చేతులే మిన్న అన్న మథర్ థెరిస్సా సూక్తిని తనలో నింపుకొని కలిసి వచ్చిన మిత్రుల సహకారంతో 2014లో అంబేద్కర్ జన్మదినమైన ఏప్రిల్ 14న విద్య ఫౌండేషన్ అనే సంస్థను స్థాపించాడు మహేందర్. ఆ సంస్థ ద్వారా వికలాంగ, అనాథ, నిరుపేద విద్యార్థులకు తగిన చేయూతనిస్తూ వారిలో ఆత్మస్థైర్యం నింపే కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు.
అలాగే ఇంకెన్నో ఇతర సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ నిస్వార్ధంగా తన వంతు సేవలు అందిస్తున్నాడు.
నిర్వహిస్తున్న పదవీ భాధ్యతలు[మార్చు]
- విద్య ఫౌండేషన్ - వరంగల్ వ్యవస్థాపకులు, అధ్యక్షులు
- దివ్యాంగ ఉపాధ్యాయుల సంఘం - తెలంగాణ రాష్ట్రం ఉపాధ్యక్షుడు
- దొడ్డి కొమురయ్య ఫౌండేషన్ -`వరంగల్ నిర్వహణ సభ్యుడు
- తెలంగాణా రచయితల సంఘం - వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి
అందుకున్న అవార్డులు/పొందిన సన్మానాలు[మార్చు]
- జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు - కలెక్టరేట్, వరంగల్ జిల్లా - (2015)
- బో.వే.రా. రాష్ట్రస్థాయి ప్రత్యేక పురస్కారం - తెలంగాణ తెలుగు భాషా పరిరక్షణ సంఘం, జగిత్యాల - (2015)
- డా. ద్వా.నా. శాస్త్రి రాష్ట్రస్థాయి ప్రత్యేక పురస్కారం - (2015)
- మహాత్మ జ్యోతిభా ఫూలే జాతీయ పురస్కారం – భారత దళిత సాహిత్య అకాడమీ, ఢిల్లీ - (2016)
- రాష్ట్రస్థాయి పురస్కారం - వసుంధర విజ్ఞాన మండలి - (2016)
- మదర్ థెరిస్సా ప్రతిభా పురస్కారం – తెలంగాణ రాష్ట్ర వికలాంగుల ఫోరం (2017)
- రాష్ట్రస్థాయి పురస్కారం - శ్రీ సాయి శాంతి సేవా సమితి - (2017)
- కళారత్న జాతీయ పురస్కారం - మథర్ ఫౌండేషన్ - (2018)
- స్ఫూర్తి పురస్కారం - పద్మావతి ఇనిస్టిట్యూట్, హైదరాబాద్ - (2018)
- సేవాజ్యోతిరత్న పురస్కారం - కె.జె.ఆర్. చారిటబుల్ ట్రస్ట్ - (2018)
- సేవాస్పూర్తి జాతీయ పురస్కారం - సాయి శివాని వొకేషనల్ ఇనిస్టిట్యూట్ - (2019)
మూలాలు[మార్చు]
- నవ తెలంగాణ దిన పత్రికలో ప్రచురితమైన కథనం
ఇతర లింకులు[మార్చు]
- మహేందర్ ఫేస్బుక్ అకౌంట్
- మహేందర్ యూట్యూబ్ ఛానల్